
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇరకాటంలో పడ్డారు. అటు సినీ పరిశ్రమ ప్రముఖులు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మధ్యలో నలిగిపోతున్నారు. అటు, ఇటు తేల్చలేక విదేశీ పర్యటనకు దిల్ రాజు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. సంధ్యా థియేటర్ లో పుష్పా 2 సినిమా ప్రదర్శనలో మహిళ మృతి ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం.. అరెస్ట్ చేయడం దుమారం రేపింది. ఆ తర్వాత చంచల్ గూడ జైలు నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు… బన్నీకి సపోర్ట్ గా ట్విట్లు చేశారు. అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఇదే ఘటనపై ప్రశ్నించడంతో.. సీఎం రేవంత్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. పేద ప్రజల పక్షాన నిలబడతామని సీఎం స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ కు కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం వివాదం ముదిరింది. తనతప్పేమీ లేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సంధ్య థియేటర్ ఘటన జరిగిన రోజు విజువల్స్ ను మినిట్ టూ మినిట్ విడుదల చేశారు పోలీసులు. తప్పంతా అల్లు అర్జున్ దే అన్నట్లుగా పోలీసులు తేల్చిపారేశారు. మరోవైపు ఓయూ జేఏసీ పేరుతో పలువురు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. అల్లు అర్జున్ పిల్లలను క్షేమంగా తన మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి పంపించారు. ఈ ఇష్యూపై సినీ పరిశ్రమ ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియక తికమక పడుతోంది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా దిల్ రాజ్ స్టెప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. రాంచరణ్ నటిస్తున్న గేమ్ చెంజర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా దిల్ రాజు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాతే సినీ పరిశ్రమ భవిష్యత్ కార్యచరణ ప్రణాళిక తేలే అవకాశముంది.
ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉన్న దిల్ రాజు.. విదేశా పర్యటన తర్వాత సీఎం రేవంత్ ను కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. త్వరలోనే సంక్రాంతికి కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సహాకారం అందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.