తెలంగాణ బీజేపీలో రాజకీయ అస్పృశ్యత !

తెలంగాణ బీజేపీలో రాజకీయ అస్పృశ్యత ఉందా ?
మండల, జిల్లా స్థాయి పార్టీ కమిటీల్లో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వట్లేదా ?
సంస్థాగత ఎన్నికలు ప్రహసనంగా కొనసాగుతున్నాయా ?
కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ పెద్దలు పరిగణలోకి తీసుకోవట్లేదా ?
తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది ?
‘అస్పృశ్యత నేరం, రాజకీయ అస్పృశ్యత అతిపెద్దనేరం’
– పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ
1967లో భారతీయ జనసంఘ్ కార్యవర్గ సమావేశంలో చెప్పిన ఆ మహానాయకుడి విధానాలకు తూట్లు పొడిచేలా తెలంగాణ బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. దీన్ దయాల్ విధానాలను జాతీయ నాయకత్వం దేశవ్యాప్తంగా అనుసరిస్తోంది. టీబీజేపీ విస్తరణలో తీవ్ర ప్రతిష్టంభన ఎదురవుతోంది. తెలంగాణ బీజేపీలో అస్పృశ్యత నెలకొందని కొత్తగా పార్టీలో చేరిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నామ్ కే వాస్తే సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే మండల కమిటీల ఎన్నిక ప్రక్రియ దాదాపుగా ముగించారు. జిల్లా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. రిసార్టుల్లో, నాయకుల ఫార్మ్ హౌజ్ లలో జిల్లా అధ్యక్ష ఆశావహుల జాబితాను సిద్ధం చేస్తుండటం పై కొత్తగా చేరిన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నేతలు తమకు నచ్చిన వారి పేర్లను రాసుకున్నారని విమర్శలు వస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో పార్బీని అధికారంలోకి తీసుకురావాలని కాషాయదళం భావిస్తోంది. అందుకు పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని చూస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో బూత్ కమిటీలతో పాటు మండల కమిటీలను పూర్తిచేసింది. త్వరలో జిల్లా అధ్యక్షులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష నియామక ప్రక్రియకు సంబంధించిన అభిప్రాయ సేకరణ అస్తవ్యస్తంగా జరుగుతోందని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి కాషాయ పార్టీలో జోరుగా వలసలు కొనసాగాయి. కానీ అసెంబ్లీ ఎన్నిక్లో బీజేపీకి వచ్చిన ఫలితాలను చూసి కొత్తవారు చేరేందుకు ఏమాత్రం సుముఖత చూపలేదు. అయితే అప్పటికే చేరినవారిని ఈ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ప్రయారిటీ కల్పించకుండా పార్టీ కొత్త నిబంధనలు తీసుకురావడంపై పలువురు నేతలు మండిపడుతున్నారు. పాత వారికే మెజారిటీగా అవకాశాలు కల్పించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. కొత్త వారికి సైతం ప్రియారిటీ కల్పించాలని పట్టుపడుతున్నారు. అయితే పార్టీ మాత్రం అధ్యక్షుడిగా కాకపోయినా ఇతర కీలక పోస్టులను కేటాయిస్తామని చెబుతున్నట్లు తెలిసింది. మొత్తంగా పార్టీలో నెలకొన్న అస్పృశ్యతకు బీజేపీ అధిష్టానం ఎలా చెక్ పెడుతుందనేది చూడాలి.
……………………………………………….fact news team