
విస్త‘రణం’
హస్తినపైనే ఆశలన్నీ
లాబీయింగ్ లో నేతలు బిజీ
తెలంగాణ కాంగ్రెస్ నేతలు నివురుగప్పిన నిప్పులా రగిలిపోతున్నారు. పదవుల పంచాయతీ ఢిల్లీ వరకు చేరింది. హస్తిన చుట్టూ లాబీయింగ్ చేసినా.. ఎక్కడో తేడా కొడుతుందని నేతలు కుమిలిపోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా… పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని సీఎం రేవంత్ నియమించుకోలేదు. అటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి మూడు మాసాలు గడిచినా.. ఇప్పటి వరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోలేదు. అటు మంత్రి వర్గంలోఛాన్స్ దక్కుతుందని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆరు మంత్రివర్గ స్థానాలు ఎవరికి ఇవ్వాలనే దానిపైఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలుమంత్రి వర్గంలో ఉండటంతో కొత్తగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలాంటి నేతలు మళ్లీ మంత్రి పదవులు దక్కుతాయని బోలెడు ఆశలు పెట్టుకున్నారు. జిల్లా సమీకరణాలు, సామాజిక కోణాల్లో ఎవరికి మంత్రి వర్గంలో బెర్త్ దక్కుతుందనే దానిపై అధిష్టానం క్లారిటీ ఇవ్వలేకపోతుంది. ఢిల్లీ ఎన్నికల తర్వాతే మంత్రి వర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అప్పటి వరకు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసుకోవాల్సిందే.
ఇక టీపీసీసీ కార్యవర్గంలో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. మంత్రి వర్గ విస్తరణకు, టీపీసీసీ కార్యవర్గానికి ముడిపడి ఉన్న నేపథ్యంలో పదవుల పంపిణీకి తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఛాన్స్ దక్కని కీలకనేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇవ్వాలని భావిస్తున్నారట. సీఎం రేవంత్ మాత్రం తన అనుచరుడు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి.. నల్గొండ రాజకీయాల్లో కొత్త ఈక్వేషన్స్ క్రియేట్ చేయాలని లెక్కలు వేస్తునట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి శ్రీహరి ముదిరాజ్, ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి లేదా రామ్మోహన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు ఛాన్స్ దక్కవచ్చిన కాంగ్రెస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మంత్రి వర్గంలో చోటు దక్కని నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి సంతృప్తి పర్చాలని భావిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ లో పదవులు దక్కాలంటే హస్తినకు వెళ్లిరావాల్సిందేనని ప్రచారం జరుగుతోంది. లాబీయింగ్ తోనే పదవులు దక్కుతాయని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి నేతలు క్యూ కడుతున్నారు. హస్తినపైన పెట్టుకున్న నేతలు ఆశలు ఏ మేరకు నెరవేరతాయో చూడాలి.