హస్తం.. అస్తవ్యస్తం…
మహేశ్వరా ! ఏమిటిది ?

తెలంగాణ కాంగ్రెస్ బండి ఎటువైపు వెళ్తుంది ?
కొత్త, పాత వివాదానికి పరిష్కారమార్గం దొరికిందా ?
పాత కాంగ్రెస్ కల్చర్ కొనసాగిస్తారా ?
మహేశ్వరుడి ముందున్న కర్తవ్యమేంటీ ?
రేవంత్ చక్కదిద్దుతారా ? చేతులెత్తేస్తారా ?
తెలంగాణ కాంగ్రెస్ లో అయోమయ పరిస్థితులు నెలకున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా.. ఇంకా కన్ఫ్యూజన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పరిస్థితి సక్లిష్టంగా మారుతుంది. అంతర్గత గొడవలతో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వెంటాడిన సమస్యలు…అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం హస్తం పార్టీని ముప్పుతిప్పలు పెడుతోంది. నిత్యం ఏదో ఒక నియోజకవర్గంలో కొత్త, పాత నేతల మధ్య పంచాయతీలతో హస్తం పార్టీలో రగడ నడుస్తూనే ఉంది. ఇంత జరుగుతున్నా పీసీసీ చీఫ్ గానీ, సీఎం రేవంత్, పార్టీ పెద్దలు మాత్రం సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిక్కెట్ కోసం గొడవలు జరిగాయి. కొత్త నేతలకు టికెట్ ఇవ్వకూడదని, పాత నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని గాంధీ భవన్లో సైతం ధర్నాలు, నిరసన దీక్షలు నిర్వహించారు. ఇక అధికారంలోకి వచ్చాక సైతం పార్టీలోకి కొత్త నేతల రాకతో నిత్యం కొత్త పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి.
పటాన్ చెరువులో రచ్చ…
అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నుండి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చేరారు. ఈ పది నియోజకవర్గాల్లో ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహాయిస్తే మిగతా చోట్ల పాత కొత్త నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల పఠాన్ చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడి కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేసారు. దాదాపు రెండు రోజులపాటు ఈ నిరసనలు కొనసాగాయి. పఠాన్ చెరులో రెండు రోజుల పాటు ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హైడ్రామాకి తెర లేపారు.
జగిత్యాలలో ఘర్షణ…
ఇక జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ మధ్య కూడా సఖ్యత లేదు. ఈ ఇద్దరు నేతల క్యాడర్ మధ్య కూడా నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా సంజయ్ పై జీవన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పు,నిప్పులా ఇద్దరు నేతలు రగిలిపోతూనే ఉన్నారు.
గద్వాలలో ఢీ అంటే ఢీ..
ఇక గద్వాలలో కూడా ఇదే పంచాయితీ నడుస్తోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరితా తిరుపతయ్యలు ఢీ అంటే ఢీ అంటున్నారు. నియోజకవర్గంలో ఇద్దరి మధ్య పంచాయతీతో కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర ఇబ్బందులు పడుతుందట. ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చేందుకు మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి ప్రయత్నం చేసినా కుదరడంలేదట. పార్టీలో చేరిన దానం నాగేందర్ ఈ మధ్య ప్రభుత్వ తీరును బహిరంగంగానే తప్పుబడుతున్నారు. ఇలా ఇతర పార్టీల నుండి వచ్చిన నియోజకవర్గాల్లో నేతల మధ్య పొసకకపోవడంతో నిత్యం నేతల మధ్య రగడ జరుగుతోంది. పార్టీలో ఇన్ని పంచాయతీలు జరుగుతున్నా పార్టీ అధిష్టానం సైలెంట్ గా ఉండడంపై జోరుగా చర్చ జరుగుతుంది.
గీత దాటుతున్న నేతలపై చర్యలేవి ?
ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినా పార్టీ పరంగా చర్యలు తీసుకోకపోవడంపై కొందరు హైదరాబాద్ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన కామెంట్స్, వ్యవహరించిన తీరు కూడా పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీని ఇబ్బంది పెట్టినా సీనియర్ కావడంతో ఏం చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారట. గద్వాల లోను పార్టీ నేత సరిత తిరుపతయ్య తీరు పిసిసి పెద్దలకు అర్థం కాని విధంగా మారిందట. ఇలా ఇబ్బందికరంగా మారిన నియోజకవర్గం ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ప్రస్తుతం పటాన్ చెరువు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితిని స్టడీ చేసేందుకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఒక కమిటీ వేశాడు. అలాగే మిగతా చోట్ల పరిస్థితి పై కూడా ఒక అనుభవజ్ఞమైన కమిటీని వేసి రిపోర్ట్ తెచ్చుకోవాలని నిర్ణయించారట. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి అంతర్గత గొడవలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కమిటీలను వేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చుకుంటారా షరా మామూలుగానే.. కాంగ్రెస్ సహజ కల్చర్ కు వదిలేస్తారా అనేది వేచి చూడాలి.