
గులాబీదళాన్ని అంతుచిక్కని ప్రశ్న వేధిస్తోందట. ఎమ్మెల్సీ కవిత దూకుడుగా జిల్లాలను చుట్టేస్తున్నారు. అధికార పక్షాన్ని కడిగిపారేస్తున్నారు. ఇంతకీ ఎమ్మెల్సీ కవిత భవిష్యత్ బీఆర్ఎస్ లో ఎలాంటి పాత్ర పోషిస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రైతు ధర్నాల పేరుతో పలు జిల్లాల్లో ధర్నాలు చేసి మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. కేటీఆర్ పార్టీపై పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు హరీశ్ సైతం ప్రభుత్వంపై పదునైన విమర్శలు సంధిస్తూ… తన మార్క్ చాటుకుంటున్నారు. ఇరిగేషన్ నుంచి మొదలు ప్రతీ అంశంపై క్షుణ్ణంగా అవగాహన కల్గిన నేతగా పేరు సాధించారు. కేటీఆర్, హరీష్ ఎవరికి వారుగా పోటీపడుతుంటున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరికి పోటీగా ఎమ్మెల్సీ కవిత రేసులోకి రావడం పార్టీలో చర్చకు దారితీసింది. ఫాంహౌస్ నుంచి కేసీఆర్ ముగ్గురిని నడిపిస్తున్నారా ? లేదా స్వతంత్రంగా ఎవరికి వారు కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నారా ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎమ్మెల్సీ కవిత… అసలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సమాచారం లేకుండానే కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీలో వైఎస్ జగన్, వైఎస్ షర్మిల పరిస్థితి చూస్తూనే ఉన్నాం. సొంత అన్నచెల్లెలు వైఎస్.జగన్, షర్మిల ఉప్పు నిప్పులా మారిపోయారు. తెలంగాణలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందా ? అనే ఆందోళన గులాబీదళంలో గుబులు రేపుతోంది. గులాబీ బాస్ ముగ్గురిని యుద్ధరంగంలో దింపి… తెర వెనక చక్రం తిప్పడం వరకు ఓకే… భవిష్యత్ ఎలా ఉంటుందనే దానిపై క్యాడర్ లో చర్చ జరుగుతోంది. ఒకరినే నమ్ముకుని పార్టీలో పనిచేస్తే… మరో ఇద్దరి నుంచి భవిష్యత్ లో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోననే భయం నేతలను వెంటాడుతోంది.
ప్రభుత్వంపై పోరాటం చేయడానికి ప్రస్తుతం ముగ్గురిని బరిలో దించిన ఫార్మూలా ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా… ముందుముందు ఆధిపత్య పోరుకు దారితీస్తే క్యాడర్ నలిగిపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. మొత్తానికి బీఆర్ఎస్ భవిష్యత్ నేత ? అనే అంతుచిక్కని ప్రశ్నతో గులాబీ నేతలు తలపట్టుకుంటున్నారు.