HYDERABAD CITY POLITICS _ GHMC POLITICS _ HYDERABAD POLITICAL HEROES _ CONGRESS _ BJP _ BRS _ MIM

భాగ్యనగరంలో ఎవరిది ఆధిపత్యం ?
కాంగ్రెస్ పట్టు బిగిస్తోందా ?
కమలం పాగా వేస్తోందా ?
కారు స్పీడ్ పెరుగుతోందా ? పతంగి ఎగురుతుందా ?
జీహెచ్ఎంసీ పాలిటిక్స్ లో గతమెంటీ ?
వర్తమానంలో ఏం జరుగుతోంది ?
గ్రేటర్ ఎన్నికల నాటికి వ్యూహమేంటీ ?
ఒకప్పుడు ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలే రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఉమ్మడి రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత క్రమంగా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతల ప్రాభవం తగ్గిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక… గ్రేటర్ లో పట్టునిలుపుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది ? ఆపరేషన్ ఆకర్ష్ లో తడబడుతోందా ? గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఏంటీ ? లష్కర్ లో పట్టు సాధిస్తారా ? పాతబస్తీని పతంగికే వదిలేస్తారా ? గోల్కొండ జగదాంబ ఆశీస్సులు ఎవరికిపై ఉండనున్నాయి ? జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఇలాకాలో కారు జోరు సాగుతోందా ? కాషాయపార్టీ లెక్కలేంటీ ? గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలపై పూర్తి విశ్లేషణాత్మకమైన కథనం…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైదరాబాద్ నేతలే చక్రం తిప్పేవారు. భాగ్యనగరంలో పుట్టిన మర్రి చెన్నారెడ్డి… టి.అంజయ్య లాంటి ముఖ్యమంత్రులయ్యారు. కొండా వెంకటరంగారెడ్డి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం ఎవరైనా… హైదరాబాద్ నేతలకు ప్రయార్టీ ఉండాల్సిందే. శంకర్ రావు, వీ.హన్మంత్ రావు లాంటి వాళ్లు మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ బ్రదర్స్ గా పీజేఆర్ , మర్రి శశిధర్ రెడ్డి పేరు సాధించారు. ఆ తర్వాత దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్ లు… వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఘనంగానే ఉన్నా… భవిష్యత్ లో మళ్లీ పుంజుకుంటారా ? లేదా ? అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది . గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పట్టుమని మూడు స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ బల్ధియాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. కంటోన్మెంట్ కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీగణేశ్ గెలవడంతో పార్టీ పరువు నిలబెట్టుకున్నారు. రేవంత్ ప్రభుత్వంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి రాజేంద్రనగర్, పటాన్ చెర్వు, ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కానీ మంత్రి వర్గంలో స్థానం సంపాదించలేకపోయారు. గ్రేటర్ హైదరాబాద్ లో మేయర్ గా ఉన్న గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో పట్టు సాధించడానికి అపసోపాలు పడుతోంది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వంలో సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తలసారి శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పద్మారావుగౌడ్ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సబితాఇంద్రారెడ్డి మంత్రివర్గంలోచోటు దక్కించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ నుంచి ఎంతోకొంత ప్రాధాన్యత దక్కిందనే చెప్పవచ్చు.


బీజేపీ జాతీయ నాయకత్వం… హైదరాబాద్ నేతలకే ప్రయార్టీ ఇచ్చింది. సికింద్రాబాద్ ఎంపీగా పనిచేసిన బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రివర్గంలో పనిచేశారు. గవర్నర్ గా ఛాన్స్ దక్కించుకున్నారు. ఇక నల్లు ఇంద్రాసేనరెడ్డికి సైతం గవర్నర్ గా ఛాన్స్ దక్కింది. మరోనేత కిషన్ రెడ్డికి సైతం కేంద్ర మంత్రిగా రెండోసారి పనిచేస్తున్నారు. ముషీరాబాద్ లక్ష్మన్ కు జాతీయ స్థాయిలో బీజేపీ అవకాశాలు కల్పించింది. రాజ్యసభ సభ్యుడిగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఛాన్స్ ఇచ్చింది. హైదరాబాద్ నేతలకు బీజేపీ పూర్తిస్థాయిలో అవకాశాలు కల్పించిందని చెప్పడంలో సందేహం లేదు.
ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్…గతంలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేశారు . మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు … కాంగ్రెస్ లో చేరడానికి రెడీగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా.. సీఎం రేవంత్ తో వైరం కారణంగా పార్టీలోకి రాలేకపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పార్లమెంట్ స్థానం నుంచి హస్తం పార్టీ నుంచి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న సునీతా మహేందర్ రెడ్డిని పోటీలో దిగి ఘోరపరాజయం పాలయ్యారు. ఓటమి తర్వాత ఆమె అటువైపు వెళ్లిన దాఖలాలే లేవు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి… గ్రేటర్ హైదరాబాద్ లో మేజర్ పార్ట్. ఇక్కడ పట్టు సాధించడానికి కాంగ్రెస్ తంటాలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ప్రాంతంపై సీఎం రేవంత్ కు పూర్తిస్థాయి పట్టున్న నేపథ్యంలో… కాంగ్రెస్ పార్టీ రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో చూడాలి. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్, మేడ్చల్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేయాలంటే… వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు చాలా కీలకం. మల్కాజిగిరి ఎంపీగా బీజేపీ నేత ఈటల రాజేందర్ భారీ విజయం సాధించారు. హైడ్రా కూల్చివేతలపై పోరాటం చేస్తూ నిత్యం ప్రజల మధ్యే ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కాగా మల్కాజిగిరిలో పట్టు నిలుపుకోవడం బీజేపీకి పెద్ద సవాల్ గా మారనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టం కట్టిన మేడ్చల్ ప్రజలు… పార్లమెంట్ ఎన్నికల్లోమాత్రం బీజేపీని గెలిపించారు. స్థానికంగా బీఆర్ఎస్ కు గట్టిపట్టుందని చెప్పవచ్చు. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఆరింటిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్న నేపథ్యంలో… గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది.

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో గతంలో అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా గెలిచారు. 2023అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కిషన్ రెడ్డి రెండుసార్లు ఇక్కడ నుంచే గెలిచారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను బరిలో దించి కాంగ్రెస్ చేతులు కాల్చుకుంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మున్నూరు కాపు, యాదవ, క్రిస్టియన్, ముస్లీం మైనార్టీ ఓట్లతో బీజేపీని దెబ్బకొట్టవచ్చని కాంగ్రెస్ లెక్కలు వేస్తొంది. లష్కర్ లో కాంగ్రెస్ లెక్కలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి. బీజేపీ కూడా పార్లమెంట్ ఎన్నికల తరహాలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు ప్లాన్ రచిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, మాగంటి గోపినాథ్ తదితర నేతలు గ్రేటర్ ఎన్నికల్లో ఉనికి చాటేందుకు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉండటం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశం. దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్ లాంటి నేతలు కాంగ్రెస్ కు బలంగాకనిపిస్తున్నా… భాగ్యనగర ప్రజలు కాంగ్రెస్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో గ్రేటర్ ఎన్నికల్లో తేలనుంది.
చేవెళ్ల పార్లమెంట్ గతంలో కాంగ్రెస్ కు గట్టిపట్టుంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి ఇక్కడ నుంచి 2009లో విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ గెలవలేకపోయింది. 2019 ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేవలం 20 వేల ఓట్ల స్వల్ప మేజార్టీతో జారవిడుచుకుంది. 2023 పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష యాభై వేల మేజార్టీతో ఎంపీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. శేరిలింగంపల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్న సబితాఇంద్రారెడ్డి… బీఆర్ఎస్ బాధ్యతలు మోస్తున్నారు. జిల్లాలో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల్లో పార్టీని అన్నీతానై నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు… కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అటు కాంగ్రెస్ నేతలు కలుపులేక… ఇటు బీఆర్ఎస్ నేతలు వెంట రాకపోవడంతో అయోమయంలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ కొత్త పాత నేతలు అంతర్యుద్ధంతో రగిలిపోతున్నారు. ఇక బీజేపీ ఎంపీ స్థానాన్ని గెలిచినా.. కింది స్థాయిలో క్యాడర్ ను బలోపేతం చేసుకోలేకపోతుంది.
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మజ్లీస్, ఎంఐఎం మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశాలున్నాయి. హైదరాబాద్ లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని మజ్లీస్ గెలిచింది. గోషామహల్ మాత్రంబీజేపీ విజయం సాధించింది. మజ్లీస్ పార్టీకి దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భాగ్యనగరంపై కాంగ్రెస్ ఫోకస్ పెడుతుందా ? లేదా ? అన్నది కాంగ్రెస్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో క్యాడర్ ను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఎలాంటి ఎత్తుగడలను అవలంభిస్తుందో చూడాలి.