యుద్ధాలు, భౌగోళిక, రాజకీయ సంక్షోభాలు, ఆర్థిక సంక్షోభాలు, పర్యావరణ సంక్షోభాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో సంక్షోభాలు ఒకేసారి మొదలవడం. ఒకేసారి విస్తరించడం. ఒకేసారి ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేయడం. దీన్నే పాలీ క్రైసీస్ అంటారు. ఇప్పుడు జరుగుతోంది అదే. ఒకవైపు అమెరికాలో జరుగుతోన్న పరిణామాలు మనతో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ లను కుదుపులకు గురి చేస్తోంది. అలానే అమెరికా పై కూడా ప్రతీకార సుంకాలకు అనేక దేశాలు సై అంటే సై అంటున్నాయి. అదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా షేక్ అవుతోంది. ఈ పౌలీ క్రైసీస్ భారత ఆర్థిక వ్యవస్థ మీద పెను ప్రభావాన్ని చూపిస్తే జరిగే పరిణామాలేంటన్న ప్రశ్న తన పరిధిని వేగంగా పెంచుకుంటోంది.
భారత దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలమైంది. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడింది. అనేక సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడింది. అయితే…ఇప్పుడు అంతర్జాతీయంగా జరుగుతోన్న పరిణామాలు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. అలానే దేశీయంగా ఆందోళన పెడుతోన్న ద్రవ్యోల్భణం, ధరల పెరుగుదల, జీతాల పెరుగుదల ఆశించిన స్థాయిలో లేకపోవడం, స్టాక్ మార్కెట్‌లో బ్లడ్ బాత్, రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత…ఇలా అనేక కోణాల్లో సమస్యలు… సంక్షోభాలుగా మారడానికి వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే…జీడీపీ వృద్ధి రేటు టెన్షన్ పెంచుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ టారిఫ్ వార్‌కి తెర తీశారు. చైనా లాంటి దేశాల మీద విధించిన భారీ స్థాయిలో ప్రతీకార సుంకాలు భారత్ మీద విధించకపోయినా…స్నేహపూర్వకంగా వ్యవహ రించారని చెప్పడానికీ వీల్లేనట్టు 26 శాతం సుంకాలు విధించారు. అదే సమయంలో ఫార్మారంగానికి టారిఫ్ వార్ నుంచి వినహాయింపు ఇవ్వడం భారత్‌కి చాలా ప్లస్ అయింది. కానీ…రాబోయే రోజుల్లో అసలు టారిఫ్‌లు ఫార్మా మీదే ఉంటాయన్న ట్రంప్ వ్యాఖ్యలు…అమెరికాని నమ్ముకుని ఆల్‌ఈజ్ వెల్ అనుకోవడానికి వీల్లేదని చెప్పకనే చెబుతోంది. ఈ సమయంలో మరోసారి భారత స్టాక్ మార్కెట్ బ్లడ్‌బాత్‌ని ఎదుర్కొంది. అటు అనేక దేశాల స్టాక్ మార్కెట్స్ పరిస్థితి కూడా ఇదే. దీంతో…ఆర్థిక సంక్షోభం దిశగా ప్రపంచ దేశాలను ట్రంప్ నెడుతున్నాడని…అత్యంత వ్యూహాత్మకంగా ప్రజల మీద ఆ భారం పడకుండా చూడాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా గుర్తింపు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలను నిరుద్యోగం, శ్రామికశక్తి, వనరులు, ముడిసరుకులు..వంటి ఏదో ఒక సమస్య ప్రధానంగా వెంటాడుతోంది. అయితే భారత్‌లో ఇలాంటి సమస్యలున్నా వాటి ప్రభావం తక్కువ. దీంతో…మన ఆర్థిక వ్యవస్థని సంక్షోభంలోకి నెట్టేసే పరిణామాలు అన్ని వైపుల నుంచి కొనసాగుతోన్నా…వాటిని తట్టుకుని నిలబడే శక్తి మన ఆర్థిక వ్యవస్థకి ఉంది. అదే సమయంలో ట్రంప్ టారిఫ్ వార్ కొత్త భయాలను రేపుతోంది. చివరకు అమెరికా కూడా ద్రవ్యోల్భణాన్ని అదుపు చేయడంలో విఫలమౌతూనే ఉంది. ఇవేవీ పట్టించుకోకుండా వాణిజ్యయుద్ధానికే ట్రంప్ మొగ్గు చూపుతున్నారు. అందుకే…మన బలాన్ని మరింత ఎక్కువుగా ఊహించుకోవడం కన్నా…పెను సంక్షోభం ముంచేసే ముందే…దిద్దుబాటు చర్యల మీద దృష్టి పెట్టడం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.