టీపీసీసీ కార్యవర్గ విస్తరణకు వేళాయే !
టీపీసీసీ చీఫ్ మహేశ్వర్ రెడ్డి తన కార్యవర్గాన్ని విస్తరించుకునే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో చోటు కోసం నేతలు పైరవీలు మొదలుపెట్టారు. ఇప్పటికే కమిటీ డ్రాఫ్ట్ కాపీ సిద్ధమైనట్లు సమాచారం. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ తో మరోసారి చర్చించి కమిటీ ని ప్రకటించే ఛాన్స్ ఉంది. సామాజిక, ప్రాంత సమీకరణాలు లెక్కలోకి తీసుకుని టీపీసీసీ కార్యవర్గంలో అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో 42 శాతం బీసీలకు, 33 శాతం మహిళలకు పదవులు కట్టబెట్టాలని భావిస్తున్నారు. త్వరలోనే తుది కసరత్తు పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్
టీపీసీసీ కార్యవర్గంలో ముగ్గురికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఛాన్స్ దక్కనుంది. ఓసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి, ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగ నుంచి ఒకరికి, మైనార్టీ సామాజిక వర్గం నుంచి మరొకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా లభించే అవకాశాలున్నాయి. కీలకమైన వర్కింగ్ పోస్ట్ కోసం భారీగా పైరవీలు చేసుకుంటున్నారు. ఇటు సీఎం, అటు పీసీసీ చీఫ్ ఇద్దరి గుడ్ లుక్స్ లో ఉన్నవారికి ఛాన్స్ దక్కుతుందా ? మీనాక్షి నటరాజన్ తో కానీ, ఏఐసీసీతో టచ్ లో ఉన్ననేతలకు వర్కింగ్ పోస్ట్ ఇస్తారా ? అనేది ఆసక్తి రేపుతోంది.
చామల వర్సెస్ వంశీచంద్

ఓసీ సామాజిక వర్గం నుంచి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఢిల్లీ రాజకీయాల్లో నిమగ్నమయ్యే వంశీచంద్ రెడ్డి… ఇటీవల తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెంచారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ ముందు వంశీచంద్ హడావిడి, హంగామా ఎక్కువ చేస్తున్నారట. వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధికార పార్టీలో చక్రం తిప్పాలని ఆయన భావిస్తున్నారట. పాలమూరులో ఎంపీగా ఓడిపోవడం వంశీచంద్ మైనస్ పాయింట్. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పై ఆశలు పెంచుకున్నారు. ఎంపీగా గెలవడం చామల కిరణ్ కుమార్ రెడ్డికి కలిసొచ్చే అంశం. ఇటీవల ఢిల్లీలో రాహులు గాంధీని నేరుగా కలుస్తూ… పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు టాక్. మొత్తానికి ఓసీ వర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఈ ఇద్దరిలో ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

సంపత్ వర్సెస్ చంద్రశేఖర్

ఇక దళిత సామాజిక వర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ను ఈసారి మాదిగ వర్గానికి ఇవ్వాలని భావిస్తున్నారట. ఇప్పటికే మాల సామాజిక వర్గానికి చెందిన నేతల డామినేషన్ కాంగ్రెస్ లో ఎక్కువగా ఉందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ మాదిగ వర్గానికి చెందిన ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ నేత సంపత్ కుమార్ కు గానీ, జహీరాబాద్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ కు గానీ దక్క అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందో చూడాలి.

ఇక మైనార్టీ సామాజిక వర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ను అజహారుద్దీన్ దక్కించుకుంటూ వస్తున్నారు. ఈ సారి గ్రేటర్ హైదరాబాద్ బల్దియా ఎన్నికల నేపథ్యంలో ప్రభావితం చేసే వ్యక్తులకే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కట్టబెట్టాలని భావిస్తున్నారట. నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ కు వర్కింగ్ పోస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి మిగతా పదవుల సంగతేమో కానీ… వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు మాత్రం భారీ డిమాండ్ నెలకొంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో… పార్టీ పదవులు దక్కించుకునేందుకు నేతలు భారీగా లాబీయింగ్ చేస్తున్నారు. ఆ మహేశ్వరుడు ఎవరిని కరుణిస్తారో ? పార్టీలో ఎవరికి రే‘వంతు’ ఇస్తారో ? లేదంటే మీనాక్షి ముందు నటించిన వారికే పార్టీ పదవులు దక్కుతాయోనన్నది చూడాలి.