
ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్‌కి ఉన్న విలువెంత ? గౌరవం ఎంత ? బంగారు నిక్షేపాలున్న బలూచిస్తాన్ పేదరికంలో మగ్గడానికి కారణమేంటీ ? పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోతే పరిస్థితి ఏంటీ ? డిటైల్డ్ స్టోరీ…
ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్‌కి ఘనమైన చరిత్రే ఉంది. నిత్యం రాజకీయ సంక్షోభాలు, ఆర్మీ తిరుగుబాట్లు, ఆర్థిక మాంద్యంతో సహవాసం...ఇలా పాకిస్తాన్ కీర్తిప్రతిష్టల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకవేళ బలూచిస్తాన్ కనుక పాకిస్తాన్ నుంచి విడిపోతే...ఆ దేశం ఇంతకంటే ఘోరమైన, హీనమైన స్థితికి చేరుకుంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే బలూచిస్తాన్ లేని పాకిస్తాన్ రెక్కలు తెగిన పక్షితో సమానం. అపారమైన ఖనిజ నిక్షేపాలు, చమురు నిక్షేపాలు, బంగారం నిక్షేపాలు ఉన్న బలూచిస్తాన్...పేదరికంలో మగ్గిపోవడానికి కారణం పాకిస్తాన్ కబంధ హస్తాలే. పాకిస్తాన్‌కి చైనా కుతంత్రాలు కూడా తోడవడంతో...బలూచ్ వాసుల కష్టాలు మరింతగా పెరిగాయి. దశాబ్దాల నుంచి బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటం సాగుతూనే ఉంది. ఉద్యమాలు, పోరాటాలు, దాడులు ఇలా అనేక పరిణామాల క్రమం తర్వాత మిలిటెంట్ పోరాటం దాకా బలూచ్ మూమెంట్ చేరుకుంది. నిజానికి బలూచ్ వాసుల అశాంతి తీవ్రరూపం దాల్చేలా చేసింది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. 62 బిలియన్ డాలర్లతో దీనిని నిర్మిస్తున్నట్టు దశాబ్దం క్రితం చైనా ప్రకటించింది. బెలూచిస్తాన్‌కు బంగారు బాతు వంటి గ్వదర్ డీప్ సీ పోర్టు నిర్మాణం చైనా చేతిలో పెట్టడం కూడా వారి తిరుగుబాటును తీవ్రం చేసింది. జిన్‌పింగ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ బలూచిస్థాన్ గుండా సాగుతుండటం వివాదానికి మరింతగా ఆజ్యం పోస్తోంది. ఆర్థిక వృద్ధికి సిపెక్ తోడ్పడుతుందని పాకిస్థాన్ ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే, తమ ప్రాంత వనరులను కొల్లగొట్టడానికి ఇదొక ఎత్తుగడ అని, దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని బలూచ్ వాసులు తెగేసి చెబుతున్నారు. సిపెక్‌కు సంబంధించిన ప్రాజెక్టులు, సిబ్బందిపై ముఖ్యంగా చైనీయులపై ఇటీవల దాడులు అధికమయ్యాయి. సిపెక్‌లో భాగమైన అరేబియా సముద్రంలోని గ్వాదర్ పోర్ట్ సైతం బలూచిస్థాన్ ప్రాంతంలోనే ఉంది. కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్న జాతీయ రహదారులనూ, ఇతర మౌలిక సదుపాయాలనూ...లక్ష్యంగా చేసుకుని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భారీ ఎత్తున దాడులు చేస్తూనే ఉంది. 6,500 కోట్ల డాలర్ల విలువైన సీపీఈసీలో ఇంధనం, రవాణా, పారిశ్రా మిక కారిడార్లూ, గ్వాదర్ పోర్టు వగైరాలున్నాయి. స్థానికులకు అవకాశాలీయకుండా ఇంత పెద్ద నిర్మాణాన్ని తలకెత్తుకుంటే అసంతృప్తి రాజుకుంటుందన్న ఇంగితజ్ఞానం పాకిస్తాన్ పాలకులకు లేకపోవడం కూడా సమస్యని తీవ్రతరం చేసింది. బలూచిస్తాన్ వాసుల డిమాండ్లు ధర్మమైనవి. కానీ అందుకు హింసాత్మక మార్గాన్ని ఎంచు కోవటంవల్ల న్యాయమైన సమస్య మరుగున పడుతుంది. అంతర్జాతీయ సమాజం నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మద్దతు లేదు. సహజంగానే తీవ్రవాద గ్రూప్‌గానే అంతర్జాతీయ సమాజం పరిగణిస్తోంది. అయితే...ఈ సమస్యకి ముగింపు ఎక్కడ ఎలా అన్న ప్రశ్నలు మాత్రం సమాధానం కోసం అన్వేషిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ జాతిపితగా పిలిచే మహ్మద్ అలీ జిన్నా...బలూచిస్తాన్‌కి చేసిన నమ్మక ద్రోహంతో ఆ ప్రాంతం కొన్ని దశాబ్దాలుగా రగులుతూనే ఉంది. పాక్ నుంచి విముక్తి, తమ వనరులపై హక్కుల కోసం బలూచ్ జనాలు తిరుగుబాట్లు చేస్తూనే ఉన్నారు. అయినా సైన్యం సాయంతో.. కుట్రలు చేస్తూ పాక్ ప్రభుత్వం ఈ తిరుగుబాటుని అణచివేస్తూనే ఉంది. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. ఏకంగా పాక్ రైల్వేకి చెందిన రైలును హైజాక్ చేయడంతో...ఇక పై బీఎల్‌ఏ నుంచి జరిగే దాడులు అత్యంత తీవ్ర స్థాయిలోనే ఉంటాయన్న విషయం స్పష్టమౌతోంది. బలూచిస్తాన్ సంపదని బలూచ్ వాసులకు ఇవ్వడానికి అంగీకరించని పాకిస్తాన్, బలూచిస్తాన్‌కి స్వాతంత్రం ఇవ్వడానికి ఒప్పుకోని పాకిస్తాన్...ఈ సంక్షోభాన్ని అధిగమిస్తుందన్న నమ్మకం అంతర్జాతీయ సమాజానికి కూడా లేదు.