

సినీ పరిశ్రమ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో ఏయే అంశాలు చర్చిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసింది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం, జైలుకు వెళ్లడం, పరామర్శలు చేయడం, అసెంబ్లీలో చర్చించడం, సీఎం రేవంత్ రెడ్డి అటాక్ చేయడం.. వెంటనే అల్లు అర్జున్ కౌంటర్ అటాక్ చేయడం.. పోలీసులు తొక్కిసలాట రోజు జరిగిన ఘటన విజువల్స్ విడుదల చేయడం.. కాచిగూడ స్టేషన్ కు పిలిచి విచారణ చేయడం.. ఇలా వరుస సన్నివేశాలు ఫిల్మీ ఇండస్ట్రీ లో దుమారం రేగింది.
తెలంగాణ డెవలప్ మెంట్ కార్పోరేషన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దిల్ రాజు.. అటు, ఇటు సర్ధిచెప్పలేక ఆడకత్తెరలో పోకచెక్కలా ఇబ్బంది పడ్డారు. విదేశీ పర్యటనకు వెళ్లిన దిల్ రాజు వెంటనే హైదరాబాద్ చేరుకుని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు. తొక్కిసలాటలో మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం ప్రకటించడం.. ఆ తర్వాత వెంటనే దిల్ రాజు సీఎం అపాయింట్ మెంట్ కోరడం వెనువెంటనే జరిగిపోయాయి. సినీ పరిశ్రమల పెద్దలకు సీఎం రేవంత్ అపాయింట్ మెంట్ ఫిక్స్ కావడంతో.. ఇప్పుడు ఏం చర్చిస్తారనేది ఇంట్రస్టింగ్ గా మారింది.
ఇప్పటికే బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. సంక్రాంతికి కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఈ తరుణంలో బెనిఫిట్ షోలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి పునరాలోచన చేయాలని సినీ పరిశ్రమ పెద్దలు కోరే అవకాశముంది. అంతేకాకుండా సీఎం రేవంత్ కు అల్లు అరవింద్ క్షమాపణలు చెబుతారా ? అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై రేవంత్ కు వివరణ ఇస్తారా ? అన్నది చూడాలి.
సినీ పరిశ్రమ ప్రభుత్వాన్ని లెక్కచేయకుండా వ్యవహరిస్తుందనే విమర్శల నేపథ్యంలో సీఎంతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం రేవంత్ సినిమా వాళ్లకు ఏం చెబుతారనేది కూడా ఆసక్తికరమైన అంశం. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగబోయే భేటీలో సీఎం రేవంత్… సినీ ప్రముఖులకు ఎలాంటి ట్రీట్ ఇస్తారనేది చూడాలి.